Bajireddy Fire | "రేవంత్‌ది ఫేక్ ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం"

 "రేవంత్‌ది ఫేక్ ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం"

రైతు సమస్యలు పరిష్కరించకుంటే కేటీఆర్ నేతృత్వంలో ఉద్యమం: హెచ్చరిక

బాన్సువాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఫైర్


(ప్రెస్ మీట్ వీడియో 👆)

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 20: "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఫేక్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, పరిపాలన చేతకాక దద్దమ్మలా వ్యవహరిస్తున్నారు" అని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. 

శనివారం బాన్సువాడలో రైతులు పడుతున్న ఇబ్బందులపై నియోజకవర్గ ఇంచార్జ్ తోట ఆగమయ్య, రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, కిషన్, ఫెరోజ్, అక్బర్, ఖలీల్, బాడీ శ్రీను తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమం  

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ, "గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు సాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు ఇలా అన్ని సమస్యలూ పరిష్కరించారు. వ్యవసాయం, టెక్నాలజీ, విద్య అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాం. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లు ఇచ్చి బాన్సువాడ రైతాంగాన్ని ఆదుకున్నాం" అని గుర్తు చేశారు.

రేవంత్‌పై విమర్శలు  

"రైతు భరోసా, బోనస్, ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ ఇష్టానుసారం మాట్లాడారు కానీ ఇప్పుడు అన్నీ విస్మరించారు. రైతుబంధు సరిగా ఇవ్వడం లేదు. 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. పరిపాలన చేతకాని దద్దమ్మవు నీవు. దళారులు చెలరేగిపోతున్నారు" అని మండిపడ్డారు.

"వ్యవసాయం గురించి రేవంత్‌కు ఏం తెలుసు? రేవంత్ ఫేక్ రైతు, ఇది ఫేక్ ప్రభుత్వం. చేతకాకుంటే ఊరుకో. యూరియా కోసం యాప్‌లో అప్లై చేయమంటున్నారు. రైతుల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కడివి? యాప్ రద్దు చేసి నేరుగా యూరియా ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు.

"కష్టపడి పండించిన ధాన్యం ఎలా అమ్ముకోవాలో రైతుకు తెలియడం లేదు. 'బడే భాయ్ మోడీ' అన్నావ్, మరి కేంద్రం నుంచి యూరియా తెప్పించలేవు, కొనుగోళ్లు చేయించలేవు. ప్రభుత్వం నడిపించే సత్తా మీకు లేదు" అని విమర్శించారు.

హెచ్చరిక, డిమాండ్లు 

"నువ్వు విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నావు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే కేటీఆర్ నాయకత్వంలో భారీ ఉద్యమం చేపడతాం" అని బాజిరెడ్డి హెచ్చరించారు.

"పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్‌లో సలహాదారుగా ఉన్నారు కదా. కనీసం రైతుల సంక్షేమానికి సలహాలైనా ఇవ్వండి" అని సూచించారు.

రైతులకు వెంటనే రైతు బీమా, బోనస్, యూరియా అందించాలని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.



Post a Comment

Previous Post Next Post