Collector's 2 Years Celebrations | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రెండేళ్ల సేవ

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రెండేళ్ల సేవ  

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు అధికారుల సన్మానం  

పారదర్శక పాలన, క్షేత్రస్థాయి తనిఖీలతో ప్రత్యేక గుర్తింపు  

క్రీడలు, విద్య, సంక్షేమ పథకాల అమలులో చొరవ

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి, జూన్ 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం రెండు సంవత్సరాల సేవా కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించారు.

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు కృషి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సదుపాయాలు, ఎన్నికల నిర్వహణ వంటి పలు రంగాల్లో సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామాల సందర్శనలు, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం ఆయన ప్రత్యేకత.



ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని ప్రజా సేవకు మరింత చేరువ చేస్తున్నారు.

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహించారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను అభినందిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేశారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తూ, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల విజయాలను గుర్తించి వారిని సన్మానించడం ద్వారా మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

జిల్లాలో క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నోట్ బుక్స్ అందించడంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేసిన కృషి విశేషంగా నిలిచింది.

కామారెడ్డి జిల్లాలో రెండేళ్ల సేవా కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవకు ప్రజలు, అధికారులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అభివృద్ధికి తన వంతు సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు.




Post a Comment

Previous Post Next Post