తడిసిన వరిని వెంటనే తరలించండి: రైతులకు నష్టం రాకుండా చర్యలు
అకాల వర్షాలతో 800 మె.ట. వరి తడిసిపోయింది: పీపీసీని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 5:అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జూన్ 5వ తేదీలోగా పూర్తికావాల్సిన కొనుగోలు ప్రక్రియను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గురువారం కామారెడ్డి డివిజన్‌లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 800 మెట్రిక్ టన్నుల వరి తడిసిపోవడంతో కలెక్టర్ శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్‌తో కలిసి రామేశ్వర్‌పల్లి ప్యాడీ పర్చేజ్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు.
రైతులతో మాట్లాడిన కలెక్టర్
పీపీసీలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. "రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించి అవసరమైన అన్ని చర్యలు చేపడతాం" అని రైతులకు భరోసా ఇచ్చారు.
వాహనాలు పెంచి తరలించండి: అధికారులకు ఆదేశం
ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా తగిన సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి తడిసిన వరిని అత్యవసరంగా రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, DCO రామ్మోహన్ రావు, ఇతర సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మిల్లర్లతో సమావేశం: 14 మందిపై ఆగ్రహం
అనంతరం సిద్ధిరామేశ్వర రైస్ మిల్లులో ఆరు పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తడిసిన వరిని వెంటనే అన్‌లోడ్ చేసి స్వీకరించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి సహకారం అందించాలని మిల్లర్లకు సూచించారు.
తమ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన 14 మంది రైస్ మిల్లర్లపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియకు సహకరించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
4.19 లక్షల మె.ట. వరి కొనుగోలు పూర్తి
జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ప్రస్తుత తేదీ నాటికి జిల్లాలో మొత్తం 4,19,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి సకాలంలో తరలించేందుకు అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
=================
నీటి నిల్వ చెరువును (ఇంకుడుగుంత ) ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా IDOC ప్రాంగణంలో DMFC(T) నిధుల ద్వారా నిర్మించిన నీటి నిల్వ చెరువును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు , పర్యావరణ పరిరక్షణకు నీటి నిల్వ చెరువులు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
DMFC(T) నిధుల నుంచి రూ.6.55 లక్షల వ్యయంతో ఈ నీటి నిల్వ చెరువును నిర్మించినట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువు చుట్టూ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడం ద్వారా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.
నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలను కూడా ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఇంచార్జి అదనపు కలెక్టర్ NV గిరి, DRDO దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Post a Comment