Ganja in Train | రైల్లో తరలిస్తున్న 20 కిలోల గంజాయి పట్టివేత

రైల్లో తరలిస్తున్న 20 కిలోల గంజాయి పట్టివేత  

నాగవళ్లి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్సైజ్ అధికారుల దాడులు

S7 బోగీ బెర్త్ కింద రెండు బ్యాగుల్లో లభ్యం.. నిందితుల కోసం గాలింపు

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి, జూన్ 20: ఉమ్మడి నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్, కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు శనివారం రైలులో అక్రమంగా తరలిస్తున్న భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాలు 

శనివారం నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా సంబల్పూర్ నుంచి  నాందేడ్ వెళ్లే నాగవళ్లి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 20809లో తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో S7 బోగీలోని ఒక బెర్త్ కింద రెండు గోనె సంచులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని తెరిచి చూడగా 20 ప్యాకెట్లలో ఎండు గంజాయి లభించింది. తూకం వేయగా మొత్తం 20 కిలోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితులు పరార్  

గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుల కోసం రైలు మొత్తం గాలించినా ఎవరూ పట్టుబడలేదు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో ట్రైనీ AES వి. అశోక్ చంద్ర, DTF CI సుందర్ సింగ్, SIలు విక్రమ్, శరత్ కుమార్, దీపిక, ట్రైనీ SI మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post