Phone Recovaries | ప్రతి నెలా 100కు పైగా ఫోన్లు రికవరీ చేస్తున్న కామారెడ్డి పోలీసులు

ప్రతి నెలా 100కు పైగా ఫోన్లు రికవరీ చేస్తున్న కామారెడ్డి పోలీసులు  

ఈ ఏడాది ₹1.05 కోట్ల విలువైన 658 ఫోన్లు స్వాధీనం: ఎస్పీ రాజేష్ చంద్ర  

CEIR పోర్టల్‌తో ఇప్పటివరకు ₹7.90 కోట్ల విలువైన 4,939 ఫోన్లు బాధితులకు అప్పగింత  

ఫోన్ పోతే ఆందోళన వద్దు, CEIRలో ఫిర్యాదు చేయండి: జిల్లా ఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 18: మొబైల్ ఫోన్ పోయిందని లేదా చోరీకి గురైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను సులభంగా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర భరోసా ఇచ్చారు.

ప్రస్తుత డిజిటల్ కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలక డేటాను కలిగి ఉండే ముఖ్యమైన పరికరమని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసు యంత్రాంగం మొబైల్స్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించారు.

ప్రత్యేక సాంకేతిక బృందం ఏర్పాటు  

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో, ఆర్‌ఎస్‌ఐ శ్రీ బాలరాజు మరియు ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందని కొనియాడారు.

రికవరీల వివరాలు  

ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 30 రోజుల్లోనే ₹25.44 లక్షల విలువైన 159 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు ₹1.05 కోట్ల విలువైన 658 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత ఏడాది సుమారు ₹3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని గుర్తుచేశారు.

CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,939 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, గుర్తించి సుమారు ₹7.90 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అప్పగించినట్లు ఎస్పీ ప్రకటించారు.

ఫోన్ పోతే ఏం చేయాలి?

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు కాలయాపన చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, దుర్వినియోగం కాకుండా వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం అధికారిక వెబ్‌సైట్ http://www.ceir.gov.in లో ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. పోయిన మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ శ్రీ బాలరాజు, ఫోన్: 8712686114 ను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఆయన అభినందించారు.

Post a Comment

Previous Post Next Post