ప్రజావాణి దరఖాస్తులు డివిజన్‌లోనే ఇవ్వాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావొద్దు - కలెక్టర్ సూచన
కామారెడ్డి ప్రజావాణిలో 105 దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. చిన్న చిన్న సమస్యల కోసం వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దని, స్థానిక స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రజావాణిలో 105 దరఖాస్తులు
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ ఇన్‌చార్జ్) ఎన్.వి. గిరి, జిల్లా పరిషత్ సీఈఓ చందర్‌లతో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
డివిజన్లలోనూ ప్రజావాణి
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్‌లలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా డివిజన్‌ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ కార్యాలయాల్లోనే సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అధికారులు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణిలో ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్త అధికారులు కలెక్టర్‌తో భేటీ
మత్స్య శాఖ అధికారిగా లయఖ్ మొయినుద్దీన్ FAC గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.
CH బాలరాం జిల్లా ఆడిట్ అధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.



Post a Comment