Top News

Collector Visit | గాంధారి మండలంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటన

గాంధారి మండలంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటన  

విద్య, గృహ నిర్మాణం, స్వయం ఉపాధి, ఓటరు సవరణపై సమీక్ష

తెలంగాణ డైలీ న్యూస్,   కామారెడ్డి: గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం వివిధ కార్యక్రమాలను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. విద్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, స్వయం ఉపాధి యూనిట్లు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

కృత్యాధార బోధనతోనే గుణాత్మక విద్య 

గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ అమలు చేస్తున్న కృత్యాధార బోధన, ఆటపాటల ద్వారా విద్యను నేర్పించే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, కృత్యాధార బోధనతోనే విద్యార్థులను ఆకట్టుకుని గుణాత్మక విద్యను అందించవచ్చని అన్నారు. ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.  

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పద్ధతిలో వెంటనే సర్దుబాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్‌ను ఆదేశించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి 

గాంధారి మండలంలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో 45 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా, 14 గ్రామాలకు ప్రతికలు వచ్చాయి, 19 గృహాల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు.  

లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, ఇసుక, మురం, ఇటుకలు కోటా లేకుండా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మహిళా స్వయం ఉపాధికి ప్రోత్సాహం

గాంధారి గ్రామంలో చిమన్ చావలి మహిళా సంఘం సభ్యురాలు శ్రీమతి అస్మా బేగం నిర్వహిస్తున్న బేకరీ యూనిట్‌ను కలెక్టర్ సందర్శించారు. యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి, మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించారు.  

అస్మా బేగం బ్యాంకు రుణం 3 లక్షలు, స్త్రీనిధి రుణం 1 లక్ష, CEF SVEP ద్వారా 50 వేల రూపాయల సహాయంతో మొత్తం 4.50 లక్షలతో వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం 4 మందికి ఉపాధి కల్పిస్తూ, నెలకు 60 వేల వేతనం చెల్లిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు 60 నుండి 70 వేల వరకు నికర లాభం పొందుతున్నారు.  

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించిన అస్మా బేగంను కలెక్టర్ అభినందించారు. ఇతర మహిళలు కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

SIR ప్రక్రియలో ప్రజలు సహకరించాలి 

గాంధారి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - SIR ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేషన్ పనుల పురోగతిని సమీక్షించారు.  

ఈ నెల 20లోపు ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారములను తప్పనిసరిగా సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారి పేర్లు జాబితా నుండి తొలగిపోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో అవగాహన కల్పించి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్, RDO ప్రభాకర్, DEO మల్లికార్జున్, MEO శ్రీహరి, PD విజయ్ పాల్ రెడ్డి, DE Housing యెల్లారెడ్డి, MPDO, MRO, DPM సాయిలు, స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post