బాన్సువాడలో విషాదం
ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య
పోలీసుల దర్యాప్తులో కారణాలు?
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. చదువు కోసం ఇంటికి దూరంగా ఉంటున్న 17 ఏళ్ల విద్యార్థిని అమృత ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకోవడంతో హాస్టల్, కాలేజీలో విషాదం నెలకొంది.
డోంగ్లీ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అమృత బాన్సువాడ టీచర్స్ కాలనీలోని ఎస్సి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం రోజు క్లాసులకు రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆరా తీశారు. అప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ లేకపోవడం గమనార్హం. (వీడియో 👇)
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆరెస్ నాయకులు హాస్టల్ కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు షేక్ అక్బర్, బాడీ శ్రీను, ఖలీల్ తదితరులు ఉన్నారు.
డి ఎస్పీ విఠల్ రెడ్డి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ కు చేరుకొని నిలదీశారు. హాస్టల్ లో వార్డెన్ లేరని, ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. డి ఎస్పీ, విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించి, సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు.
ఒక చిన్న వయసులో, పెద్ద కలలతో చదువుకుంటున్న విద్యార్థిని ఇలా కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నిరై ఏడుస్తున్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే సంఘటన జరిగిందని వాపోతున్నారు.
బాన్సువాడలో బీఆర్ఎస్ రాస్తారోకో
రూ.20 లక్షల ఆర్థిక సాయం, వార్డెన్ సస్పెన్షన్ డిమాండ్
అధికారి హామీతో ఆందోళన విరమణ
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అమృత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.విద్యార్థిని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
అధికారి హామీతో విరమణ
విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ చేపట్టి కుటుంబానికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








Post a Comment