ఎల్ నినో ప్రభావం: రైతులకు పూర్తి మద్దతు అందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
30 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, కూరగాయల సాగు ప్రోత్సాహం
ఆగస్టు 30లోపు విద్యార్థులకు 2 జతల యూనిఫాంలు పంపిణీ చేయాలి
కామారెడ్డి: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు పూర్తి మద్దతు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు.
శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి ఎల్ నినో నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీపై వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులకు భరోసా ఇవ్వాలి
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ అమలు చేయాలని సూచించారు. సుమారు 30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను జిల్లా, మండల, గ్రామ స్థాయిల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ ఇస్తున్న అంచనాలు నిజమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులు త్వరగా మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉన్నందున అధికారులు ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళ్లి వారి మనోభావాలను అర్థం చేసుకుని అవగాహన కల్పించాలని సూచించారు.
దేశవ్యాప్తంగా దాదాపు 20 పంటలకు కనీస మద్దతు ధర MSP అమలులో ఉందని, కేవలం వరి పంటకే MSP ఉందని భావించడం సరికాదని తెలిపారు. పత్తి సహా అనేక పంటలకు MSP రక్షణ ఉందని వివరించారు. మార్కెట్ ధర MSP కంటే తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలతో రైతుల ఆదాయం తగ్గదని, కొన్నిసార్లు ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహించాలని, వాటికి మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కామారెడ్డి కలెక్టర్ సమీక్ష
విసి అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి, సంక్షేమ, డిఆర్డీఏ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం అందించాలని, ఆగస్టు 30 వరకు మొత్తంగా రెండు జతల ఏకరూప దుస్తులు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. యూనిఫాంల తయారీలో వస్త్రాల లభ్యత కీలకమని, సరఫరాలో ఉన్న సమస్యలను ప్రత్యేక బృందాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఎల్ నినో ప్రభావంతో పంటల సాగుకు ఎదురయ్యే నీటి సమస్యలను వివరిస్తూ రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర లభించే పంటలు, కూరగాయల సాగుపై రైతు వేదికల ద్వారా, రైతు వాట్సప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం, ప్రస్తుతం జరిగిన పంట సాగుపై సమగ్ర నివేదికలు అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ NY గిరి, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డిఆర్డీఏ దామోదర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి మల్లికార్జున్, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, KGBV, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

إرسال تعليق