నేలకు వేలాడుతున్న విద్యుత్ తీగలు... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
తెలంగాణ డైలీ న్యూస్, సదా శివనగర్ : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల మధ్యగా వెళ్తున్న విద్యుత్ లైన్లు రైతులు, కూలీలు, పశువులకు ప్రాణహానిగా మారాయి. నేలకు కేవలం 4 నుంచి 5 అడుగుల ఎత్తులో వేలాడుతున్న తీగల కారణంగా గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలాలకు...
గ్రామంలోని పలు వ్యవసాయ భూముల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు కిందికి వంగిపోయి మనుషుల ఎత్తుకు సమీపంగా ఉన్నాయి. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు మాత్రమే కాకుండా పశువులను మేపడానికి వెళ్లే వారు కూడా తీవ్ర భయాందోళనలతో జీవనం సాగిస్తున్నారు.
గేదెలు, మేకలు, ఎద్దులు విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని గ్రామమంతా ఆందోళన నెలకొంది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తీగలు మరింత కిందికి వంగే ప్రమాదం ఉందని, తడి నేల కారణంగా విద్యుత్ ప్రసరణ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, గడ్డి మోసే వాహనాలు తీసుకెళ్లే సమయంలో కూడా ఈ తీగలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి. ఎత్తయిన వ్యవసాయ యంత్రాలు తీగలకు తగిలే ప్రమాదం ఉండడంతో భయంతోనే పనులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు
గ్రామ రైతులు పలుమార్లు విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించడం లేదని, తీగలు సరిచేయడం, స్తంభాలు బలపరచడం వంటి పనులు చేపట్టడం లేదని మండిపడుతున్నారు.
"మేము పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నాం. గేదెలను మేపడానికి తీసుకెళ్లినా గుండెల్లో భయం వేస్తుంది. చిన్నపిల్లలు పొలాల దగ్గరికి వెళ్లినా ఆందోళనగా ఉంటుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందన లేదు. ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?" అని గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు.
తక్షణ చర్యలు కోరుతున్న గ్రామస్తులు
ప్రమాదం జరిగాక స్పందించడం కాదు, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భూంపల్లి గ్రామంలో నేలకు అతి దగ్గరగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేసి సరైన ఎత్తుకు ఎత్తాలని, అవసరమైతే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, పాడైన తీగలను మార్చాలని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఏఈ, ఏఏఈ, లైన్మెన్ స్పందించి రైతులు, కూలీలు, గ్రామ ప్రజలు, పశువుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సమస్యను పరిష్కరించకపోతే కలెక్టర్‌కు అందరం కలిసి వినతిపత్రం అందజేస్తామని హెచ్చరించారు.

Post a Comment