సిద్ధిపేటలో అండర్-13, అండర్-15 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం
రూ.11.50 కోట్ల స్టేడియం పనులు నిలిపివేతపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
సిద్ధిపేటను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని హామీ
(దాస శ్రీనివాస్ - సిద్ధిపేట)
సిద్ధిపేట ఇండోర్ స్టేడియంలో అండర్-13, అండర్-15 బాలురు, బాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బ్యాడ్మింటన్ కోర్టు ఇంత బాగా ఉపయోగపడుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్, ఫుట్‌బాల్ మైదానం నిర్మించామని, అక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని తెలిపారు. అయితే స్విమ్మింగ్ పూల్‌ను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రూ.50 లక్షలతో 2 కొత్త కోర్టులు
మొదట ఒకే బ్యాడ్మింటన్ కోర్టు ఉండేదని, సరిపోవడం లేదని క్రీడాకారులు కోరగా వెంటనే రూ.50 లక్షలు మంజూరు చేయించి మూడు నెలల్లోనే మరో రెండు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు నిర్మించి ఇచ్చినట్లు చెప్పారు. ఈ రెండు కొత్త కోర్టుల వల్ల సిద్ధిపేట పట్టణానికి చెందిన ఎంతో మంది పిల్లలకు ఒకేసారి శిక్షణ తీసుకునే అవకాశం లభించిందన్నారు.
స్పోర్ట్స్ హబ్‌గా సిద్ధిపేట
Health is Wealth అన్నట్లు క్రీడలు ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. రేపటి భారత పౌరులను గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఇలాంటి స్పోర్ట్స్ హబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ హబ్, వాటర్ హబ్‌గా ఎదిగిన సిద్ధిపేట స్పోర్ట్స్ హబ్‌గా కూడా దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని చెప్పారు.
రూ.11.50 కోట్ల పనులు ఆపివేత
స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో రూ.11.50 కోట్లు మంజూరు చేశామని, టెండర్లు, కాంట్రాక్టులు పూర్తయ్యాయని తెలిపారు. ఆ నిధులతో వాలీబాల్, క్రికెట్, హాకీతో పాటు మరిన్ని క్రీడలకు మౌలిక వసతులు కల్పించాలని ప్రణాళిక రూపొందించామన్నారు.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆరోపించారు. మూడు సంవత్సరాలు అవుతున్నా ఆ రూ.11.50 కోట్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, సిద్ధిపేట అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. సిద్ధిపేట కూడా తెలంగాణలో భాగమే కదా, సిద్ధిపేట క్రీడాకారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చూపుతోందని అన్నారు. అయితే చీకటి తర్వాత వెలుగు వస్తుందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రూ.11.50 కోట్లతో స్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
క్రీడాకారులకు పిలుపు
మేము మీకు ఇంత మంచి క్రీడా వేదిక ఇచ్చాం. దానికి ప్రతిఫలంగా సిద్ధిపేట నుంచి ఒక జాతీయ స్థాయి, ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు రావాలని క్రీడాకారులను కోరారు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై ఆడే క్రీడాకారుడు సిద్ధిపేట నుంచే రావాలని ఆకాంక్షించారు. అందరూ కష్టపడి సాధన చేసి సిద్ధిపేట పేరును దేశవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.






إرسال تعليق