Top News

Muncipal Review by Harish Rao |సిద్ధిపేట మున్సిపాలిటీ పనులపై మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష

సిద్ధిపేట మున్సిపాలిటీ పనులపై మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష  

సిబ్బంది కొరతపై ఆగ్రహం - ఏఈ, సానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆదేశం  

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచన

(దాస శ్రీనివాస్ - సిద్ధిపేట)

స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్ధిపేటలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అధికారులకు సూచించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సిబ్బంది కొరతపై ఆందోళన  

సమావేశంలో మాట్లాడుతూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 4 అసిస్టెంట్ ఇంజనీర్ రెగ్యులర్ పోస్టులు ఉండగా ఒక్క ఏఈతోనే పనులు నడుస్తున్నాయని, అలాగే ఒక్క సానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రకాల చెత్త సేకరణతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన సిద్ధిపేటలో ఒక్క సానిటరీ ఇన్స్పెక్టర్ ఉండటం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను భర్తీ చేయాలని పబ్లిక్ హెల్త్ ENC తో ఫోన్‌లో మాట్లాడి కోరారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ENCను ఆదేశించారు.

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి 

నర్సపూర్, ఎర్ర చెరువు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పట్టణంలో ఎల్లమ్మ గుడి వద్ద, విక్టరీ చౌరస్తా, నాసర్‌పురలో జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కోమటి చెరువు ఎంట్రెన్స్ పార్క్ అభివృద్ధి చేయడంతో పాటు చెరువుపై పలు అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న నాలుగు తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేసి వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిటి రోడ్లు, సిసి రోడ్ల పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

పారిశుధ్యం, పారదర్శకతపై దృష్టి

వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు మున్సిపాలిటీ సేవలు పారదర్శకంగా అందించాలని, అధికారుల సమన్వయంతో సేవలు అందించాలని కోరారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్, మేనేజర్లు, DE, AEలు, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم