Top News

Harish Rao | సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మరో మైలురాయి

 

సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మరో మైలురాయి  

50 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్ పూర్తి - హరీష్ రావు

(దాస శ్రీనివాస్ - సిద్దిపేట బ్యూరో/తెలంగాణ డైలీ న్యూస్ )

సిద్దిపేట: నంగునూర్ మండలంలో ఏర్పాటు చేసిన సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అనతి కాలంలోనే 50 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్ పూర్తి చేసి మరో మైలురాయి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. 

గురువారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఫ్యాక్టరీ సామర్థ్యం, ప్రత్యేకతలు

- రోజుకు 600 టన్నులు, నెలకు 18 వేల టన్నుల క్రషింగ్ చేసే పూర్తి స్థాయి సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీగా రికార్డ్ నెలకొల్పింది

- సిద్దిపేట ఫ్యాక్టరీలో ఆయిల్ శాతం టర్న్‌ఓవర్ ఎక్కువగా ఉండటం రైతులకు ఎంతో మేలు చేస్తోంది

- ఎంత ఖర్చు అవుతుందో అంతే ఆదాయం రైతుకు తిరిగి వచ్చేలా వ్యవస్థ ఉంది

- పిప్పితో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు

- భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఆశీస్సులతో రిఫైనరీని ఏర్పాటు చేశాం. ఆయిల్ పామ్ గెలలు లోపలికి వెళితే బాటిల్‌తో నూనె నేరుగా వంటింటికి వచ్చేలా ఆధునాతన విధానంతో ఫ్యాక్టరీని నిర్మించాం

రైతులకు మేలు

కాళేశ్వరం నీళ్లు, చెక్‌డ్యామ్‌లతో తేమ శాతం పెరగడంతో సిద్దిపేట ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందని హరీష్ రావు చెప్పారు. ప్రస్తుతం ధర 24 వేల రూపాయలకు చేరిందని, మొదట్లో నమ్మకం లేకపోయినా ఇప్పుడు నెల నెల ఆదాయం రావడంతో రైతులు ఆయిల్ పామ్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

రైతులకు అవసరమైన ఎరువులు, డ్రిప్, మొక్కలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో చంద్లాపూర్, ఎల్లాయిగూడ, ములుగు వద్ద నర్సరీలు ఉన్నాయని, అవసరమైన మొక్కలను రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులకు సూచనలు

సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ పెంచాలని, సాగు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. 

రైతులకు నిత్యం అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా రైతుల్లో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట జిల్లా, నియోజకవర్గం ఎప్పుడూ ఫస్ట్‌లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.




Post a Comment

أحدث أقدم