ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక్క మైనారిటీ ఓటు కూడా తొలగిపోనివ్వం: మాజీ మంత్రి హరీష్ రావు
ఆంధ్ర ప్రభుత్వం సీరియస్, తెలంగాణ నిర్లక్ష్యం
మైనారిటీ ఓట్ల తొలగింపుపై బిజెపి కుట్ర
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, సిద్దిపేట : ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక్క మైనారిటీ ఓటు కూడా తొలగిపోకుండా చూసే బాధ్యత తమదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పై ప్రజల్లో నెలకొన్న ఆందోళన అనవసరమని, ప్రతి ఒక్కరూ ముందస్తుగా దరఖాస్తు ఫారాలు నింపాలని సూచించారు.
గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మత పెద్దలు, పార్టీ నాయకులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
మైనారిటీ ఓట్ల తొలగింపుపై బిజెపి కుట్ర
ముస్లిం మైనారిటీల ఓట్లను క్రమపద్ధతిలో తొలగించాలని భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, అదే పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్కులు
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు సహాయం అందించేందుకు భారత రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసిందని తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించామని పేర్కొన్నారు.
ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఓటర్లు ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని సూచించారు. 2002 ఓటర్ జాబితాలోని కుటుంబ బంధుత్వ వివరాల ఆధారంగా ఓటర్ మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. బిఎల్ఓలు రెండు దరఖాస్తు ఫారాలను అందజేస్తారని, వాటిని పూర్తి చేసి ఒక దానిని బిఎల్ఓకు సమర్పించి, మరొక దానిపై బిఎల్ఓ సంతకం తీసుకుని తమ వద్ద భద్రపరచుకోవాలని సలహా ఇచ్చారు. అవసరమైన ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ఒకవేళ పత్రాలు లేనిపక్షంలో తహసిల్దార్ ద్వారా కుల ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పార్టీ సహకరిస్తుందని చెప్పారు.
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎవరి ఓటును తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. 2002 ఓటర్ జాబితాలో అనేక మంది పేర్లలో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయని, దరఖాస్తు సమయంలో వాటిని సరిదిద్దుకోవచ్చని తెలిపారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల తరపున ఇంట్లోని వారు దరఖాస్తు ఫారాన్ని నింపి సమర్పించవచ్చని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ కేంద్రాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉండేందుకు ఎన్నికల సంఘమే అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
స్వయంగా దరఖాస్తు చేసిన హరీష్ రావు
తాను కూడా ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజలందరూ భయాందోళనలకు గురికాకుండా, కలిసికట్టుగా పనిచేసి ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Post a Comment