Top News

Lok Adalat | కామారెడ్డిలో ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ పై సమన్వయ సదస్సు

కామారెడ్డిలో ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ పై సమన్వయ సమావేశం  

ఎన్‌ఐ యాక్ట్ కేసుల త్వరిత పరిష్కారంపై న్యాయవాదులకు అవగాహన

 తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కామారెడ్డి జిల్లా కోర్టులో సమన్వయ సమావేశం నిర్వహించారు. 

అనంతరం కామారెడ్డి బార్ అసోసియేషన్ హాల్‌లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద నమోదైన కేసుల త్వరిత పరిష్కారం, న్యాయవాదుల పాత్రపై అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ పి. ముక్తిద  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజీకి అనుకూలంగా ఉన్న పెండింగ్ ఎన్‌ఐ యాక్ట్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు న్యాయవాదులు, సంబంధిత వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. 

పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ కేసుల్లో రాజీకి అవకాశాలు ఉన్నందున, న్యాయవాదులు తమ క్లయింట్లకు రాజీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, పరస్పర అంగీకారంతో వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాజీ ద్వారా కేసులు పరిష్కారమైతే సమయం, ధనం ఆదా కావడంతో పాటు పక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. కోర్టుల సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ప్రతి న్యాయవాది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి, DLSA సెక్రటరీ డా. సూర సుమలత మాట్లాడుతూ, ఎన్‌ఐ యాక్ట్ కేసుల్లో రాజీకి అధిక అవకాశాలు ఉన్నందున సంబంధిత పక్షాలకు చట్టపరమైన అవగాహన కల్పించి, పరస్పర అంగీకారంతో వివాదాల పరిష్కారానికి న్యాయవాదులు చొరవ చూపాలని కోరారు. కేసుల పెండెన్సీ తగ్గించి సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. నారాయణ మాట్లాడుతూ, న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా న్యాయవాదులు పూర్తి సహకారం అందిస్తూ ఎన్‌ఐ యాక్ట్ కేసుల త్వరిత పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కే. సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post