Top News

Padma Devendar Reddy | షాబాద్ బాధితులను పరామర్శించనివ్వకుండా అడ్డుకోవడం దారుణం



షాబాద్ బాధితులను పరామర్శించనివ్వకుండా అడ్డుకోవడం దారుణం

హోంశాఖ వైఫల్యమే షాబాద్ ఘటనకు కారణం

ప్రతిపక్షాలను అడ్డుకోవడం కాదు.. నేరాలను అరికట్టాలి

బాధితులను పరామర్శించే హక్కు కూడా లేదా?

షాబాద్ ఘటనపై ప్రభుత్వం కళ్లు తెరవాలి

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలి.. ప్రతిపక్షాలపై కాదు

షాబాద్ బాధితులకు న్యాయం చేయాలి.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి.

పెరుగుతున్న నేరాలపై సీఎం సమీక్ష ఎందుకు చేయడం లేదు?

నిరంకుశ పాలనకు షాబాద్ ఘటన నిదర్శనం

మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి

(తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో-దాస శ్రీనివాస్/మెదక్ )

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన దారుణ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. షాబాద్ ఘటన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హోంశాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం లేదని, పోలీసులకు తగిన శిక్షణ కల్పించడంలో విఫలమైందని అన్నారు.షాబాద్ ఘటనలో నిందితుడు గతంలో పోక్సో కేసులో ఉన్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇవ్వడం, బాధిత కుటుంబ సభ్యులు ముందుగానే ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం హోంశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు.బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకే వెళ్తుండగా తమను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బాధితులను పరామర్శించే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు.ముఖ్యమంత్రి వెంటనే స్పందించి హోంశాఖను సమర్థుడైన మంత్రికి అప్పగించాలని లేదా ప్రత్యేకంగా హోంమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం కాకుండా నేరాలను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుని షాబాద్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post