ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
కామారెడ్డి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 114 దరఖాస్తులను స్వీకరించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టర్ అందరి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపుతూ, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం గతంలో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, NV గిరి, పీడీసీ రవితేజ, DRO పాండు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
====================
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం - National Deworming Day సందర్భంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన చిన్నారికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
సోమవారం కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కిశోరులకు సంవత్సరానికి రెండుసార్లు అల్బెండాజోల్ మాత్ర ఇవ్వడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.
నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
జిల్లాలో అర్హులైన 2,46,177 మంది చిన్నారులు, విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్ర తప్పనిసరిగా అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మాత్ర వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే రోజు మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలందరికీ తప్పనిసరిగా మాత్రలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. జె. వెంకటి, ప్రోగ్రామ్ అధికారి డా. రోహిత్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, స్థానిక కౌన్సిలర్ అఖిల, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్, స్థానిక వైద్యాధికారి డా. చందన ప్రియ, ఎంఈఓ ఎల్లయ్య, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు వై. మాధవి, వైద్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.





Post a Comment