తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్
డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి ఎద్దడి
కాలి బిందెలు, బకెట్లతో ఆందోళన
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామపంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
కాలి బిందెలు, బకెట్లతో ఆందోళన
గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా లేక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు కాలి బిందెలు, బకెట్లతో గ్రామపంచాయతీ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
డబుల్ బెడ్ రూమ్ కాలనీలో బోరు మోటర్ చెడిపోయిందని, ఇటు మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని తెలిపారు. తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. వార్డ్ మెంబర్, గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికారుల స్పందన
ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి గీతను గ్రామస్తులు అడగగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బోరు మోటర్ రిపేర్ చేయించి కాలనీలో తాగునీటిని సరఫరా చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రెండు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఉందని ప్రజలు గమనించాలని సూచించారు.

Post a Comment