కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్
చనిపోయే వాళ్లను బ్రతికిస్తా, చంపడం నా సంస్కృతి కాదు : ప్రత్యర్థులపై బాజిరెడ్డి ఫైర్
బాన్సువాడ, ఆగస్టు 30: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలందరినీ మోసం చేసిందని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.
బాన్సువాడలో జరిగిన సమారభేరి సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేశారు.
"వర్ణి, కోటగిరిలో చనిపోయిన ఇద్దరు వాళ్ల మనుషులే. వాళ్లు నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను చనిపోయే వాళ్లను బ్రతికిస్తాను, చంపడం నా సంస్కృతి కాదు" అని అన్నారు.
అభివృద్ధి విషయంలో ప్రత్యర్థుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "నా హయాంలోనే బాన్సువాడ నుండి నిజామాబాద్ డబుల్ రోడ్, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ వంటి అభివృద్ధి పనులు చేయించాను. కేసీఆర్ నిధులు మంజూరు చేస్తే ఆ నిధులతో అభివృద్ధి చేసి నేనే చేశానని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే నిధులు తీసుకురండి" అని సవాల్ విసిరారు.
"మీరు ఇచ్చిన అధికారంతోనే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఎవరైనా బెదిరిస్తే వారి పేర్లు రాసి పెట్టండి" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తున్నా ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు, ఎనిమిది రోజుల పాటు 'పోరుబాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బాజిరెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అధికారికంగా ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారని, దీన్ని విజయవంతం చేయాలన్నారు.
బీఆర్ఎస్ పోరుబాట నిరసన షెడ్యూల్:
- సెప్టెంబర్ 2: నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యంపై ధర్నాలు, ఇంటింటికీ 'బాకీ కార్డుల' పంపిణీ.
- సెప్టెంబర్ 3: వ్యవసాయ విధ్వంసం, సాగునీరు, విద్యుత్ సమస్యలు మరియు 22ఏ నిషేధిత భూముల జాబితా అంశాలపై రైతు సదస్సులు, దీక్షలు.
- సెప్టెంబర్ 4: మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, పింఛన్ల అమలులో వైఫల్యాలపై మహిళా గర్జన, వంటావార్పు కార్యక్రమాలు.
- సెప్టెంబర్ 5: ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు.
- సెప్టెంబర్ 6: ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు; హైదరాబాద్‌లో ఆటోలతో పౌర సమస్యలపై నిరసన ర్యాలీ.
- సెప్టెంబర్ 7: జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ 420 హామీల మోసంపై వినతిపత్రాల సమర్పణ.
- సెప్టెంబర్ 8: జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత.
ప్రభుత్వాన్ని సాగనంపే వరకు పోరాటం: విజి గౌడ్
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో మంజూరైన నిధులతో చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ జెండాను కాపాడుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మోరీల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ కోటగిరి శ్రీనివాస్, కిషన్, జుబేర్, ధర్మతేజ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.




إرسال تعليق