ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు చెక్...!
ఫిర్యాదుకు ఆన్‌లైన్ వేదిక
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
- అధిక ఫీజులు, నిబంధనల ఉల్లంఘనలపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం
- ‘ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్’ వెబ్‌సైట్ రూపకల్పన
- ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు గ్రీవెన్స్ ఐడీ కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 21: ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై పాఠశాలల యాజమాన్యాల తీరుపై తల్లిదండ్రులు సులభంగా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ 'ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్' (PSCMS)ను అందుబాటులోకి తెచ్చింది. విద్యా హక్కు ప్రతి పిల్లవాడికీ సమాన హక్కు అనే నినాదంతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఫిర్యాదు చేయడం ఇలా..
- అధికారిక వెబ్‌సైట్‌లోకి (https://schooledu.telangana.gov.in/PSCMS/userAuthenticateByOTP.do) వెళ్లాలి.
- మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వచ్చే ఓటీపీని (OTP) నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- పాఠశాల వివరాలు, జిల్లా, మండలం, ఎదుర్కొంటున్న సమస్యను నమోదు చేసి, సంబంధిత ఆధారాలను అప్‌లోడ్ చేసి ఫిర్యాదు ఫారాన్ని పూర్తి చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే ‘గ్రీవెన్స్ ఐడీ’ (Grievance ID) ద్వారా ఫిర్యాదు పరిష్కార పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
వేటిపై ఫిర్యాదు చేయవచ్చు? అధిక ఫీజుల వసూలు, సరైన ఫీజు రసీదు ఇవ్వకపోవడం, పాఠశాలల ద్వారానే బలవంతంగా పుస్తకాలు, యూనిఫామ్‌లు కొనిపించడం మరియు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఇతర అంశాలపై తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుతో పాటు ఫీజు రసీదు జిరాక్స్/ఫోటో, నోటీసులు, మెసేజ్‌లు, చాట్లు లేదా స్క్రీన్‌షాట్ల వంటి ఆధారాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్.. ఈ ఆన్‌లైన్ విధానంపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు 040-23120300 నంబర్‌ను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


إرسال تعليق