కామారెడ్డి: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు వి. విక్టర్, ఎన్.వై. గిరి, శిక్షణ కలెక్టర్ రవితేజ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 52 ఫిర్యాదులు అందాయి.
ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా విచారణ నిర్వహించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరమైన అంశాలను అధికారులు స్వయంగా పరిశీలించాలని, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను రికార్డుల్లో నమోదు చేసి దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
===========================
టాస్-ఉల్లాస్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి: టాస్-ఉల్లాస్ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో టాస్-ఉల్లాస్ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, డీఆర్‌డీఓ, పీడీ మెప్మా, ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ టాస్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి టాస్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించారు.
ఉల్లాస్ కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 2026 ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్షకు అర్హులైన అభ్యాసకులను సిద్ధం చేయాలని తెలిపారు. గతంలో పరీక్షకు హాజరు కాని వారు, ఉత్తీర్ణత సాధించని వారిని గుర్తించి నమోదు చేయాలని, అక్షరాస్యత కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించాలని సూచించారు.
టాస్, ఉల్లాస్ కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయి పురోగతిని పర్యవేక్షించాలని, అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
=======================
ఆక్రమణ జాతి కలుపు మొక్కలను గుర్తించి నిర్మూలించాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆక్రమణ జాతి కలుపు మొక్కలను గుర్తించి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆక్రమణ జాతి కలుపు మొక్కల గుర్తింపు, నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు వి. విక్టర్, ఎన్ వై గిరి, అసిస్టెంట్ కలెక్టర్ రవి తేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆక్రమణ జాతి కలుపు మొక్కలను అధికారులు, సిబ్బంది గుర్తించి తొలగించారు. ఆక్రమణ జాతి మొక్కల వ్యాప్తిని అరికట్టాలనే సంకల్పానికి ప్రతీకగా ఈకో ఫాన్ సొసైటీ రూపొందించిన ‘థంబ్స్ డౌన్’ సంకేతాన్ని అందరూ ప్రదర్శించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆక్రమణ జాతి కలుపు మొక్కలు పంటల ఉత్పాదకతను తగ్గించడంతో పాటు స్థానిక వృక్షజాతుల పెరుగుదలను అడ్డుకుంటాయని, జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో వీటి వ్యాప్తిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి శాఖ అధికారులు చొరవ చూపాలని, ఎప్పటికప్పుడు నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈకో ఫాన్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేట్టు సాయి సంపత్, రాష్ట్ర సమన్వయకర్త తలారి విక్రమ్ ఆక్రమణ జాతి మొక్కల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించి, వాటి గుర్తింపు పద్ధతులను తెలియజేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది ఆక్రమణ జాతి కలుపు మొక్కల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.




إرسال تعليق