Top News

Collector | సంక్షేమ పథకాల్లో జాప్యం ఉండకూడదు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

సంక్షేమ పథకాల్లో జాప్యం ఉండకూడదు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం

కామారెడ్డి: ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టితో జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగింది.  సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, కామారెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.

దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి

సమావేశంలో ఈ-కేవైసీ నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ, దీపం పథకం ప్రయోజనాల బదిలీ, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం కొత్త చౌక ధరల దుకాణాల కేటాయింపుపై విస్తృతంగా చర్చించారు.  

కలెక్టర్ మాట్లాడుతూ "దివ్యాంగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించాలి. ఈ-కేవైసీ సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సరుకులు, సంక్షేమ పథకాలు నిరంతరం అందేలా చూడాలి" అని అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థలకు నాణ్యమైన సరఫరా 

హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ, బీసీ, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు ఆవిరితో ఉడికించిన బియ్యం స్టీమ్ రైస్, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్ కీలక ఆదేశాలు  

సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  

విజిలెన్స్ కమిటీ సభ్యులు ప్రస్తావించిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజా సంక్షేమంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ NY గిరి, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, DM శ్రీకాంత్, రవీందర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

------------------------------


ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు  

"స్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు" నేపథ్యంగా జిల్లా వ్యాప్త కార్యక్రమాలు

వారోత్సవాల ప్రారంభం  

కామారెడ్డి: ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సంవత్సరం వారోత్సవాల నేపథ్యం "స్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు - ఫలితాలనిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేయడం". ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పాలిచ్చే తల్లులకు అవసరమైన మద్దతు అందించడం, అనుబంధ పోషకాహార పద్ధతులను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారుజిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో గృహ సందర్శనల ద్వారా గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు.

తల్లిపాల ప్రయోజనాలు  

ఈ సందర్భంగా అధికారిణి ప్రసన్న మాట్లాడుతూ ప్రసవం అయిన వెంటనే వచ్చే పసుపు రంగు ముర్రు పాలు అత్యంత పుష్టికరమైనవని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు మాత్రమే ఇవ్వాలని కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

బిడ్డ వయసు 6 నెలలు వచ్చే వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమని తెలిపారు. తల్లిపాలు బిడ్డను విరేచనాలు, న్యుమోనియా వంటి వ్యాధుల నుండి కాపాడతాయని పేర్కొన్నారు.

అలాగే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని, తల్లి-బిడ్డల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయని వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబ సభ్యుడు అర్థం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి కోరారు.

Post a Comment

أحدث أقدم