ఓటర్ల డిజిటలైజేషన్‌లో లోపాలపై సీఈవో అసంతృప్తి
క్రాస్ వెరిఫికేషన్ చేయకుంటే కఠిన చర్యలు
పట్టణాల్లో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి :
ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌లో జరుగుతున్న పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.
బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో అనేక పొరపాట్లు జరుగుతున్నట్లు గుర్తించామని సీఈవో తెలిపారు. ఈ కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీఎల్‌వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేయాలని సూచించారు. యాదృచ్ఛికంగా ఓటర్ల వివరాలను పరిశీలించి అన్ని లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం తప్పిదాలు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉందని గుర్తుచేస్తూ, సూపర్‌వైజర్లు బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అలాగే అన్ని స్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించి, ఆ మీటింగ్ మినిట్స్‌ను కమిషన్‌కు పంపాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
ప్రతి సోమవారం మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణి
జిల్లా కేంద్రానికి అనవసర ప్రయాణాలు వద్దు
సమస్యలు స్థానికంగానే పరిష్కారం : కలెక్టర్
జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు ప్రతి సోమవారం జిల్లాలోని డివిజన్, మండల స్థాయిలోనూ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
వచ్చే వారం నుంచి ప్రజావాణి ఫిర్యాదులు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ స్థాయిలోనే సమర్పించాలని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక నుండి అన్ని మండల కేంద్రాలలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం నుంచి ప్రజావాణి వినతులు, ఫిర్యాదులను మండల, డివిజన్ స్థాయిలోనే సమర్పించాలని ప్రజలను కోరారు.
ప్రజలు జిల్లా కేంద్రానికి అనవసరంగా ప్రయాణించి ఇబ్బందులు పడకుండా, తమకు సమీపంలోని మండల, డివిజన్ ప్రజావాణి కార్యక్రమాల్లోనే వినతులు సమర్పించాలని సూచించారు. అక్కడ అందిన ప్రతి వినతిని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, నిర్దేశిత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక పరిస్థితులు లేదా తప్పనిసరి అవసరం ఉన్న సందర్భాల్లో మాత్రమే జిల్లా కేంద్రానికి వచ్చి వినతులు సమర్పించాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో స్వీకరించే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 80 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, ఇతర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు), తహసీల్దార్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అందిన ప్రతి దరఖాస్తు పురోగతిని పరిశీలించి, శాఖల వారీగా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టి, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.ప్రజావాణి ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జడ్పీ సీఈవో చందర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం :
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.
వేదిక, అతిథుల సీటింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారి కి కలెక్టర్ ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.
జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులతో దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ,సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల వివరాలతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ అదనపు స్థానిక కలెక్టర్ NY గిరి. ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ. డి ఆర్ వో పాండు , జెడ్పి సీఈఓ చందర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
-----------------------------
తాత్కాలికంగా తల్మడ్ల రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేతకు అనుమతి
కామారెడ్డి జిల్లా తల్మడ్ల యార్డు వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నెం. 569Aను తాత్కాలికంగా మూసివేయడానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు జూలై 31, 2026న ఉత్తర్వులు జారీ చేశారు. ముద్‌ఖేడ్–మెద్చల్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో, రెండు నెలల పాటు RUB నెం. 569Aను మూసివేసి, వాహనాలను RUB నెం. 570A ద్వారా మళ్లించాలని నిర్ణయించారు.
ఈ ప్రతిపాదనపై పోలీసు శాఖ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, జిల్లా పంచాయతీ అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ట్రాఫిక్ సజావుగా సాగుతుందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తవని పోలీసు శాఖ నివేదించింది. అలాగే ఆర్ అండ్ బీ, రెవెన్యూ శాఖలు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాయి.అయితే, గ్రామస్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ అండర్‌పాస్ మార్గంలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సూచించారు.రైల్వే అధికారులు మూసివేత సమయంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు, డైవర్షన్ సూచికలు ఏర్పాటు చేయడం, ప్రత్యామ్నాయ మార్గంలో ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



إرسال تعليق