మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత
సైబర్, గంజాయి, ఆర్థిక నేరాలపై ప్రత్యేక నిఘా
పోలీస్ అధికారులతో ఎస్పీ నెలవారీ సమీక్ష
కామారెడ్డి : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ, ప్రతి కేసులోనూ వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రేవ్ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్, పోక్సో, మహిళలపై నేరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ తదితర కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, సైంటిఫిక్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు.
జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ బాధితులకు తక్షణ స్పందన ఇచ్చి, డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
నేరాల నివారణలో భాగంగా ప్రతి పోలీస్ అధికారి క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించాలని, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం వేగంగా పోలీసులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, అవసరమైతే కొత్త రౌడీషీట్లు తెరవాలని సూచించారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ధాబాలు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశించారు.
డయల్-100కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నాకాబందీలు, నైట్ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూధన్, శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి, గటుమాలు, ఉదయ్ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.




إرسال تعليق