Top News

Gaddar Vardhanti | ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభ

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభ  

సిద్దిపేట, హైదరాబాద్‌లో కార్యక్రమాలు  

పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ  

తెలంగాణ డైలీ న్యూస్, సిద్దిపేట : 

ఈనెల 6న సిద్దిపేటలో, హైదరాబాద్‌లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో వర్ధంతి సభ పోస్టర్‌ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్, టిపిటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, కో చైర్మన్ ఆస లక్ష్మణ్ మాట్లాడుతూ తన 60 ఏండ్ల జీవితాన్ని ప్రజలకు, ప్రజా యుద్ధానికి, పీడిత ప్రజల విముక్తి కోసం అంకితం చేసి, ప్రజలకు తన పాటను అంకితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ భౌతికంగా దూరమై మూడేళ్లు గడుస్తున్నాయని చెప్పారు. ఆయన భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, బోధించిన ఆకాంక్షలు, ఆయన పాట ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌కు మరణం లేదని, ఆయన చూపించిన మార్గంలో అసమ సమాజాన్ని అంతం చేసే వరకు ప్రజల పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం గద్దర్ కుమారుడు సూర్యం ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ ఏర్పడిందని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6న హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం 4 గంటలకు వర్ధంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు ఉదయం 8 గంటలకు సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలంలో సిద్దిపేట గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

ఈ రెండు వర్ధంతి కార్యక్రమాల్లో గద్దర్ అభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.

Post a Comment

أحدث أقدم