Top News

Health Minister's Review | నిజామాబాద్ జిల్లా ఆసుపత్రులపై ఆరోగ్య మంత్రితో సమీక్ష

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రులపై ఆరోగ్య మంత్రితో సమీక్ష  

బాన్సువాడ ఆసుపత్రులకు అదనపు నిధులు, సిబ్బంది కోరిన పోచారం  

గర్భిణీలు, శిశు ఆరోగ్యం, గ్రామీణ వైద్యంపై ప్రత్యేక దృష్టి  

సానుకూలంగా స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర రాజ నర్సింహా 

పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు 

హైదరాబాద్/నిజామాబాద్ :

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు  దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు.


బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న, పూర్తి కావస్తున్న ఆసుపత్రులకు అవసరమైన మరికొంత నిధుల మంజూరు గురించి, ప్రస్తుతం ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరత వంటి అంశాలపై మంత్రితో పోచారం  చర్చించారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయన పలు ప్రతిపాదనలు సమర్పించారు.

చందూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిధుల కొరత కారణంగా పూర్తి కాలేదు. దీని పూర్తి కోసం అదనంగా రూ. 40 లక్షలు మంజూరు చేయాలని కోరారు.

వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సౌకర్యం లేదు. అక్కడ డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందించాలని, అలాగే ఆ ఆసుపత్రికి అవసరమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది పరికరాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కోటగిరి 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావస్తుండడంతో, ఆ ఆసుపత్రికి సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు మంజూరు చేయాలని కోరారు.

బాన్సువాడ 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం తుది దశలో ఉంది. ఈ ఆసుపత్రికి ఆధునిక పరికరాలు, ఐసీయూ, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ మంజూరు చేయాలని సూచించారు.

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రిని కోరారు.  ఈ సమీక్ష లో ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, భూపతి రెడ్ది, ధనపాల్ సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగతూ పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم