భారీ వర్షాల్లో 45 మంది ప్రయాణికులను రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
రామారెడ్డి రోడ్డులో బస్సు నిలిచిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్
ప్రాణనష్టం లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి పంపిన అధికారులు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి :
భారీ వర్షాల కారణంగా రామారెడ్డి రోడ్డులోని అంజిల్రెడ్డి ఆసుపత్రి, సుభాష్ టాకీస్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తుండగా, గొల్లపల్లి నుండి రంగంపేటకు పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సైలెన్సర్‌లో నీరు చేరడంతో బస్సు మధ్య రోడ్డులోనే నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు, ఫైర్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. రోడ్డుపై వేగంగా ప్రవహిస్తున్న నీటిని లెక్కచేయకుండా రోప్ సహాయంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించారు. పోలీసు, ఫైర్ శాఖల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు రక్షించిన వీడియోలు 👇👇

إرسال تعليق