బాన్సువాడలో ఘనంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన
- వేడుకగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన
- హాజరైన వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
బాన్సువాడ, ఆగస్టు 23: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన, నందీశ్వర స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి – పుష్ప దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్తంభ, నందీశ్వర ప్రతిష్ఠాపన కార్యక్రమాలను కన్నులపండువగా పూర్తి చేశారు.
ఈ పవిత్ర మహోత్సవంలో ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి – ప్రేమల దంపతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.







إرسال تعليق