బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆందోళన
- సివిక్స్, జువాలజీ లెక్చరర్లను వెంటనే నియమించాలని డిమాండ్
- ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థుల బైఠాయింపు, వినతిపత్రం అందజేత
బాన్సువాడ, (తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న అధ్యాపకుల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైన సివిక్స్, జువాలజీ లెక్చరర్లను తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
కళాశాల ప్రాంగణం నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు... కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ జరుగుతున్న 'ప్రజావాణి' కార్యక్రమం సందర్భంగా ఆర్డీవో విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సముదాయించి వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... కళాశాలలో సివిక్స్ లెక్చరర్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయన బోధన తమకు అస్సలు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్జెక్టు స్పష్టంగా బోధించే అనుభవజ్ఞులైన లెక్చరర్లను నియమించి తమ భవిష్యత్తును కాపాడాలని కోరారు. ముఖ్యంగా సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన లేకపోవడంతో పరీక్షల దృష్ట్యా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
అధికారులు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.


إرسال تعليق