Top News

Diesel thefts on highway | హైవేపై డీజిల్ దొంగతనాలు - ముఠా అరెస్ట్

హైవేపై డీజిల్ దొంగతనాలు - ముఠా అరెస్ట్

ఇన్నోవాను ప్రత్యేకంగా మార్చి చోరీలు

పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడి - ఎల్లారెడ్డి డీఎస్పీ

కామారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 06:

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలపై పార్క్ చేసిన లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. అహ్మద్ ఖాన్ ఫిర్యాదు మేరకు TS12UE1882 టిప్పర్ నుంచి 120 లీటర్ల డీజిల్ చోరీ అయినట్లు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర  ఆదేశాలతో సీఐ వీరయ్య, ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టారు.

05.09.2026 రాత్రి 11:30 గంటలకు మరో చోరీకి ఇన్నోవాలో బయలుదేరిన నిందితులను గుర్తించి వెంటాడి, 06.09.2026 ఉదయం 07:30 గంటలకు తిరుమనపల్లి రోడ్డుపై అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ముఠా పనితీరు:

నిందితులు విలాసవంతమైన జీవితం కోసం ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల లారీలను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో ట్యాంకుల తాళాలు పగులగొట్టి పైపుతో డీజిల్ ను 35 లీటర్ల క్యాన్లలో నింపి తరలించేవారని, హైదరాబాద్ కు చెందిన మునీర్ అనే వ్యక్తికి క్యాన్ రూ.2,500 చొప్పున విక్రయించేవారని వెల్లడించారు. ఇన్నోవా వెనుక సీట్లు తొలగించి క్యాన్ల రవాణాకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారని తెలిపారు.

అరెస్టయిన వారు:

A1 వర్త్యా రవి నాయక్ (32) మియాపూర్, A2 లంబాడి శంకర్ (23) మియాపూర్, A3 శ్రీనివాస్ చవాన్ (27) రంగారెడ్డి జిల్లా. వీరు గతంలో నాగర్ కర్నూల్, కేశంపేట, నారాయణపేట, కోస్గి, సదాశివనగర్, చౌటుప్పల్, చిట్యాల, తూప్రాన్ తో పాటు పలు పీఎస్ ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలిందని, వీరి నుంచి ఇన్నోవా వాహనం, 20 డీజిల్ క్యాన్లు, 3 సెల్ ఫోన్లు, పైపు, 3 నంబర్ ప్లేట్లు, రూ.3,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన ఎస్సై పుష్పరాజ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు.




Post a Comment

أحدث أقدم