👉ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ఇద్దరు చిన్నారులను కాపాడిన కామారెడ్డి బ్లూ కోల్ట్స్ పోలీసులు
👉సమయస్ఫూర్తి చాటిన సిబ్బంది
👉మూడు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ రామకృష్ణ, హోం గార్డ్ నర్సిములును అభినందించిన జిల్లా ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో ఈరోజు సాయంత్రం ఒక విషాద ఘటన తృటిలో తప్పింది. సుమారు 4:30 గంటల సమయంలో లింగాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తాయేరు గార్డెన్ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందిన వెంటనే అత్యంత వేగంగా స్పందించిన బ్లూ కోల్ట్స్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రామకృష్ణ, హోం గార్డ్ నర్సిములు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్‌పై మృత్యువుకు చేరువలో ఉన్న మహిళను, ఆమె ఇద్దరు పసిపిల్లలను చూసిన సిబ్బంది, క్షణమాత్రం ఆలస్యం చేయకుండా వారిని సురక్షితంగా పట్టాల పైనుండి పక్కకు తీసుకువచ్చారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, సదరు మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆత్మహత్య పరిష్కారం కాదని అవగాహన కల్పించారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సమయానికి స్పందించి మూడు నిండు ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పిస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
Post a Comment