కామారెడ్డిలో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు
శివపార్వతుల కళ్యాణం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహణ
ఎస్పీ కార్యాలయంలో జయంతి వేడుకలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. సిరిసిల్ల రోడ్డులోని వాసవి మాత ఆలయంలో నిర్వహించిన వేడుకలు పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపాయి.
ముఖ్య అతిథిగా షబ్బీర్ అలీ
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసవి మాత ఆలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, "వాసవి మాత వైశ్య సమాజానికి ఆరాధ్య దైవం. ఆమె త్యాగం, ధర్మం, సమానత్వానికి ప్రతీక. తెలంగాణ ప్రభుత్వం వైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం గర్వకారణం. దీనివల్ల వైశ్య సమాజానికి తగిన గౌరవం లభిస్తుంది" అని అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి సమానంగా కృషి చేస్తోంది. ప్రతి సమాజ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఐరేనీ సందీప్, దేవరాజ గౌడ్, గంప ప్రసాద్, దివ్య పాత, వలిపిశెట్టి లక్ష్మీ రాజ్యం, భాస్కర్, తిరుమల గౌడ్, ఐరనీ నరసయ్య, ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైశ్య సంఘాల నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ ఘనంగా వాసవి మాత జయంతి
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏప్రిల్ 27న వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర వాసవి మాత చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వాసవి మాత త్యాగం, అహింసా మార్గం సమాజానికి ఆదర్శం. ఆమె చూపిన సత్యం, న్యాయం, శాంతి మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శాంతి, సౌహార్దం, నైతిక విలువలను పెంపొందించుకోవడమే వాసవి మాత జయంతి సందేశం" అని అన్నారు.
"శాంతి, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సమాజంలో న్యాయం, సౌహార్దం నెలకొల్పడంలో అందరూ తమ వంతు పాత్ర పోషించాలి. విలువలు ఉన్న సమాజమే శక్తివంతమైన దేశానికి పునాది" అని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ నర్సింహా రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొని మాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


Nice updates
ReplyDeletePost a Comment