అతివేగం ప్రాణం తీసింది: చెట్టును ఢీకొట్టిన కారు

ఎల్లారెడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం  

నసురుల్లాబాద్ యువకుడు దండ్ల నాగరాజు స్పాట్‌లోనే మృతి

తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొత్త హనుమాన్ మూల మలుపు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కళ్యాణి ప్రాజెక్టు సమీపంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన దండ్ల నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అతివేగం కారణంగానే కారు అదుపుతప్పిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post