ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి – కార్మిక్ సంఘ్ (BMS) డిమాండ్
వీసీ, ఎండీకి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం
జూన్ 2026 నుంచి అపాయింట్‌మెంట్ డే అమలు చేయాలని విజ్ఞప్తి
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు సంబంధించిన అపాయింట్‌మెంట్ డేట్‌ను వేగవంతం చేయాలని కోరుతూ టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్ (BMS) రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం సోమవారం ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి మెమోరాండం సమర్పించింది. కార్మిక్ సంఘ్ అధ్యక్షులు వెంకటాచారి నేతృత్వంలో ఈ వినతి పత్రం అందజేశారు.
సమ్మె విరమణ నేపథ్యం:
భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ యూనియన్ అయిన టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘం ఏప్రిల్ 22, 2026 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి చొరవతో రవాణశాఖ మంత్రి, మంత్రుల బృందం, ఐఏఎస్ కమిటీ బృందంతో సచివాలయంలో జరిగిన చర్చల్లో వేతన సవరణ, యూనియన్ వెరిఫికేషన్, విలీన ప్రక్రియ అపాయింట్‌మెంట్ డేట్ తదితర డిమాండ్లపై ఒప్పందం కుదరడంతో సమ్మెను విరమించారు. మేడే రోజున ముఖ్యమంత్రి కార్మికులతో మాట్లాడిన అంశాలు ఆనందం కలిగించాయని సంఘం పేర్కొంది.
ప్రధాన డిమాండ్లు:
1. గతంలో ఆమోదం పొందిన విలీన ప్రక్రియ అపాయింట్‌మెంట్ డే విధివిధానాలను తెలంగాణ ఆవిర్భావ నెల జూన్ 2026 నుంచి ప్రారంభించాలి.
2. గతంలో ఆర్టీసీకి వర్తించిన కార్మిక చట్టాలను, నూతన కార్మిక కోడ్ చట్టాలను యథావిధిగా విలీన ప్రక్రియలో ఆర్టీసీకి వర్తింపజేయాలి.
3. విలీన ప్రక్రియ విధానంలో అధికారులు, జాతీయ యూనియన్ నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలి.
4. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ అమలు చేయాలి.
5. ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న రెగ్యులేషన్స్‌ను అవసరం మేరకు మార్పు చేయాలి.
6. సీసీఎస్, పీఎఫ్, తార్నాక హాస్పిటల్ వంటి కార్మిక సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలి.
7. జోనల్ వ్యవస్థను రద్దు చేసి డిపో, రీజియన్, కార్పొరేట్ పాత విధానాన్ని పునరుద్ధరించి ఆర్టీసీని బలోపేతం చేయాలి.
8. ప్రస్తుతం ఆర్టీసీలో ఇస్తున్న ఆర్థికపరమైన, ఇతర బెనిఫిట్స్‌ను యథాతథంగా అమలు చేయాలి.
9. డిపో నుంచి కార్పొరేట్ స్థాయి వరకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యూనియన్లకు ప్రాధాన్యత ఇచ్చి ఫ్రెండ్లీ ఆర్టీసీ విధానాన్ని అమలు చేయాలి.
పైన తెలిపిన అంశాలను దృష్టిలో ఉంచుకొని అపాయింట్‌మెంట్ డే విధివిధానాలు రూపొందించి కార్మికుల్లో ఉన్న అశాంతిని తొలగించాలని, సంస్థ రక్షణ, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కార్మిక్ సంఘ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.

Post a Comment