Pocso Case | పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు – రూ.50,000 జరిమానా




•పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు – రూ.50,000 జరిమానా  

•దేవునిపల్లి పోలీసుల కృషితో నేరస్తుడికి శిక్ష  

•చిన్నారులపై దారుణాలకు తావులేదు – ఎస్పీ రాజేష్ చంద్ర

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో  జిల్లా న్యాయమూర్తి సీహెచ్.వీఆర్‌ఆర్ వర ప్రసాద్ మంగళవారం ఈ తీర్పు వెలువరించారు.

కేసు వివరాలు:  

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫిర్యాదుదారు తన మైనర్ కుమార్తె కామారెడ్డిలోని ప్రైవేట్ కాలేజీలో చదువుతుండగా, అదే కాలేజీలో చదివే తోకల రాజశేఖర్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని పలుమార్లు వేధించాడు. బాలిక నిరాకరించినా నిందితుడు ఆమె ఫోన్ నంబర్ సంపాదించి, మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వీడియోలు పంపాడు. 

అనంతరం వీడియో కాల్స్ సమయంలో ఆమెకు తెలియకుండా రికార్డింగ్ చేసి, ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించాడు. మాయమాటలు చెప్పి బాలికను బయటకు ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లికి వివరించడంతో ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 18, 2022 నాడు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అరెస్టు, శిక్ష:  

బాధితురాలి కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారిని విచారించి నిందితుడు తోకల రాజశేఖర్ (25) ను అరెస్టు చేశారు. అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించి పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితునికి జీవిత ఖైదు, రూ.50,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఎస్పీ అభినందనలు:  

ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అప్పటి దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ ఎం. జ్యోతి, కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేషు, ప్రస్తుత రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ రంజిత్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ రవిలను జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర అభినందించారు.

“చిన్నారులపై దారుణాలకు ఎటువంటి తావు లేదు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు. చిన్నారులు, మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వారిపై జరిగే నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోం” అని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు భరోసా ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post