Drunk and Drive Cases | మద్యం మత్తులో డ్రైవింగ్‌పై కామారెడ్డి పోలీసుల ఉక్కుపాదం


•మద్యం మత్తులో డ్రైవింగ్‌పై కామారెడ్డి పోలీసుల ఉక్కుపాదం

•5 నెలల్లో 3,510 కేసులు

•₹42.01 లక్షల జరిమానా

•508 మందికి జైలు 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 8 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 3,510 మందిపై కోర్టులు శిక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెల్లడించారు. వీరిపై మొత్తం ₹42,01,000 జరిమానా విధించగా, 508 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి.

శిక్షల వివరాల ప్రకారం 499 మందికి ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు, తొమ్మిది మందికి వారం నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష పడింది. నేర తీవ్రత ఎక్కువగా ఉన్న ఇద్దరు నిందితులకు ఏకంగా 31 రోజుల జైలు శిక్ష విధించారు. కేవలం జరిమానాతో తప్పించుకోవడం సాధ్యం కాదని, మద్యం తాగి రోడ్డెక్కితే జైలుకు వెళ్లాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “మద్యం మత్తులో వాహనం నడపడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ప్రాణాలతో చెలగాటం. స్టీరింగ్‌పై ఉన్నది చేయి కాదు, యమపాశం. ‘ఏం కాదులే’ అనే ఒక్క క్షణిక నిర్ణయం కుటుంబాలను అనాథలుగా మార్చగలదు. నాన్న ఎప్పుడు వస్తావని అడిగే పసిపాప పిలుపు శోకంగా మారకూడదు” అని  హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై ఒక రోజు నుంచి నెల రోజుల వరకు జైలు శిక్ష, జరిమానాలు విధించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరడం పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post