Education Week | కామారెడ్డి జిల్లాలో విద్యా వారోత్సవాలు ప్రారంభం




కామారెడ్డి జిల్లాలో విద్యా వారోత్సవాలు ప్రారంభం  

సమ్మర్ క్యాంప్ మే 25 వరకు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:  

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో విద్యా వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పాల్వంచ మండలం భవానిపేట్ తాండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.



ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కేజీబీవీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభ, నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని కోరారు.

విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని కలెక్టర్ చెప్పారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను తిలకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, పాల్వంచ తహసీల్దార్ జనార్ధన్, డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంఈఓ, కేజీబీవీ ప్రిన్సిపల్ మహిషా, డీఈసీవో సుకన్య, ఇతర శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post