హెగ్గెలిలో సొసైటీకి తాళం వేసిన రైతులు
నానో యూరియా బలవంతపు అమ్మకంపై ఆగ్రహం
తెలంగాణ డైలీ న్యూస్, పోతంగల్:
నిజామాబాద్ జిల్లా పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్గెలి గ్రామంలో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. అవసరం లేని నానో యూరియా లిక్విడ్‌ను బలవంతంగా ఇస్తున్నారంటూ సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు.
రైతులు మాట్లాడుతూ, గతంలో కొనుగోలు చేసిన నానో యూరియా ఇంకా మిగిలే ఉందని తెలిపారు. అయితే "మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలి" అనే నిబంధన విధించడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఒక్కో లిక్విడ్ బాటిల్ వల్ల రూ.200 అదనపు భారం పడుతోందని, ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పది సంచులకు ఒక లిక్విడ్ బాటిల్ ఇస్తే కొనుగోలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు.
రైతుల ఆరోపణలపై స్పందించిన వ్యవసాయ అధికారి, నానో యూరియా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. సొసైటీ సిబ్బందిని ప్రశ్నిస్తే, లిక్విడ్ తీసుకోని పక్షంలో స్టాక్‌ను తిరిగి పంపిస్తామని చెబుతున్నారని వెల్లడించారు.
ఈ ఆందోళనలో రైతులు రుక్కయ్య, అర్జున్, సురేందర్, అశోక్, ప్రవీణ్, భారత్, చందు, గణేష్, రాము, ఆంజనేయులు, వినయ్, సురేందర్ పాల్గొన్నారు.

Post a Comment