Highway Bus Stand | కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటుకు వినతి

కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటుకు వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైవే, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలిసి వినతిపత్రం అందించింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు మంత్రిని కలిశారు. 

వినతిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా వ్యవహరించారు. బస్టాండ్ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, స్థలం కేటాయించాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా కేంద్రం ఉత్తర తెలంగాణలో ప్రముఖ పట్టణంగా విస్తరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం పట్టణ జనాభా లక్ష దాటిందని, పట్టణం నలువైపులా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఉన్న కొత్త బస్టాండ్ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

44వ జాతీయ రహదారి విస్తరణ తర్వాత ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగ్‌పూర్, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కామారెడ్డి పట్టణంలోకి రావడం లేదని, నాన్‌స్టాప్ బస్సుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. 44వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ పరంగా, ఆర్టీసీకి అనుకూలంగా భూమి అందుబాటులో ఉన్నందున ఆ స్థలాన్ని కేటాయించి నాన్‌స్టాప్ బస్టాండ్ లేదా హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఉత్తర తెలంగాణలో కీలకమైన కామారెడ్డి నుంచి రాకపోకలు సాఫీగా సాగేందుకు హైవే బస్టాండ్ అవసరమని, దీనివల్ల ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన వారిలో అడ్లూర్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, క్రెడా అధ్యక్షుడు గణగోని లక్ష్మి నర్సాగౌడ్, కాంగ్రెస్ నేత శ్రీధర్ రావ్ ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post