మూడు చోరీ కేసులు ఛేదన
ఐదుగురు నిందితుల అరెస్ట్
ఎస్పీ రాజేష్ చంద్ర
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో మూడు వేర్వేరు చోరీ కేసులను ఛేదించారు. ఇద్దరు నిందితులు, ఇద్దరు జువెనైల్స్ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి నగదు, ఆటో, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.
కేసు 1: శ్లోక లిక్కర్ మార్ట్ చోరీ
మే 7 రాత్రి కామారెడ్డిలోని శ్లోక లిక్కర్ మార్ట్ షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.50 వేల నగదు చోరీ చేశారు. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు, మున్సిపల్ కార్యాలయం ఎదుట వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు షేక్ ఇర్ఫాన్, మహమ్మద్ నూరుద్దీన్, ఒక జువెనైల్‌గా గుర్తించారు. మరో నిందితుడు అఖిల్ పరారీలో ఉన్నాడు.
నిందితులు హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆటో దొంగిలించి, అదే వాహనంలో కామారెడ్డికి వచ్చి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరి నుంచి రూ.16,500 నగదు, ఆటో రిక్షా, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. A1 ఇర్ఫాన్‌పై మీర్‌చౌక్, డబీర్‌పుర, అఫ్జల్‌గంజ్‌లో, A2 అఖిల్‌పై చందానగర్, బాలానగర్‌లో కేసులు ఉన్నాయి.
కేసు 2: ఏటీఎం కార్డు మార్పిడి మోసం
మే 7న సిరిసిల్ల రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద తిమ్మకపల్లికి చెందిన గుర్రాల శ్రీనివాస్‌కు సహాయం చేస్తానని నమ్మించి, గడ్డమీది రమేష్ అనే నిందితుడు ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. అసలు కార్డు తన వద్ద ఉంచుకొని నకిలీ కార్డు ఇచ్చి రూ.20 వేల నగదు డ్రా చేశాడు.
విచారణలో ఏప్రిల్ 28న ఓ మహిళపై దాడి చేసి ఏటీఎం కార్డు లాక్కొని రూ.37 వేలు డ్రా చేసినట్లు తేలింది. నిందితుడు రమేష్‌పై 2010 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో 36 కేసులు ఉన్నాయి. పోలీసులు రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం వినియోగ సమయంలో అపరిచితుల సహాయం తీసుకోవద్దని, పిన్ నెంబర్ చెప్పవద్దని ఎస్పీ సూచించారు.
కేసు 3: డీసీఎం బ్యాటరీల చోరీ
ఏప్రిల్ 30 రాత్రి గంజ్ మార్కెట్ ప్రాంతంలోని కార్యాలయం తాళం పగులగొట్టి మూడు డీసీఎం బ్యాటరీలను అల్లం శివ కుమార్ అనే నిందితుడు దొంగిలించాడు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో ఆటోలో బ్యాటరీలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మద్యం, జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇతనిపై కామారెడ్డి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో దాడి, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మూడు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.
మూడు కేసులను వేగంగా ఛేదించిన టౌన్ సీఐ బి. నరహరి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, ఎస్‌ఐలు ఉస్మాన్, నాగరాజు, సాయికిరణ్, సిబ్బంది రంగారావు, కమలాకర్, రాజు, సంపత్, రామస్వామి, మైసయ్య, సామి, శ్రీనివాస్‌లను ఎస్పీ యం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.
Note: వీడియో కోసం యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయగలరు.

Post a Comment