వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జూన్ 5లోపు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
కామారెడ్డి కలెక్టరేట్‌లో కొనుగోళ్లపై సమీక్షా సమావేశం
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి:
కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్, డీఎంఅండ్‌ఎస్‌వో, డీఎంసివిల్ సప్లైస్, డీఆర్డీఓ, డీఎస్‌వో, డీఎం మార్క్‌ఫెడ్, డీఎంఓ, ఏడీఏ, వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ మానిటరింగ్ అధికారులు, ఐకేపీ, ఐవీఎం, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జూన్ 5 డెడ్‌లైన్
వర్షాకాలం ప్రారంభం, వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వరి, మొక్కజొన్న కొనుగోలు, రవాణా, తరలింపు ప్రక్రియలను ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
రైతులకు సూచనలు
కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసి రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియల్లో అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వరి నిల్వలు, కుప్పలను తార్పాలిన్లతో కప్పి రక్షించాలని, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాలకు తడిసిన వరిని రైస్ మిల్లర్లు తిరస్కరించకుండా అన్‌లోడ్ చేయాలని, ప్రతి రైస్ మిల్లు రోజుకు కనీసం 12 వాహనాలను అన్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
కొనుగోళ్ల పురోగతి
ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలో 70,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయగా 65,000 మెట్రిక్ టన్నులు తరలించారు. మరో 25,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు అవకాశం ఉంది. మొక్కజొన్నలో 1,471 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా 1,231 మెట్రిక్ టన్నులు తరలించారు. మరో 239 మెట్రిక్ టన్నులు తరలించాల్సి ఉంది.
సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, అన్ని భాగస్వాములు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి రైతుల ప్రయోజనార్థం జూన్ 5లోపు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Post a Comment