"రేవంత్ నాయకత్వంలో సంక్షేమం బ్రహ్మాండం": ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడలో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' నియోజకవర్గ స్థాయి సమావేశం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్‌లో శనివారం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పోచారం కీలక వ్యాఖ్యలు:
సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి" అని అన్నారు.
"అధికారులు, నాయకులు సహృదయంతో సహకరించుకొని పని చేస్తే అసలు సమస్యలు అనేవే ఉండవు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజాపాలన లక్ష్యం" అని స్పష్టం చేశారు.
అవినీతి నేతలపై ఘాటు వ్యాఖ్యలు:
"ప్రజలకు మోసం చేసి అక్రమ ఆస్తులు, డబ్బులు సంపాదించుకున్న నాయకుడు అసలు నాయకుడే కాదు. సేవ చేసే ఓపిక లేకుంటే రాజకీయాల్లోకి రావద్దు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి ప్రజలకు పని చేయాలి. హైదరాబాద్‌లో కూర్చుని నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయకూడదు" అని పరోక్షంగా విమర్శించారు.
ప్రజాపాలన కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో మధు మోహన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), కామారెడ్డి; సాయన్న, పీడీ, డీఆర్‌డీఓ, నిజామాబాద్; నియోజకవర్గ స్థాయి అధికారులందరూ; అన్ని ఏఎంసీ చైర్మన్లు; సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




Post a Comment