బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు
కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రీడ్‌విత్ 12తో పాటు బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్ల కింద శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు
బాలిక తల్లి ఫిర్యాదు ప్రకారం, కామన్ ఫ్రెండ్ ద్వారా సాయి భగీరథ్‌కు తన కుమార్తెతో పరిచయం ఏర్పడింది. గతేడాది డిసెంబర్ 31న మియాపూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా బాలిక అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిందని పేర్కొన్నారు.
అలాగే, అక్టోబర్ నెలలో నానక్‌రాంగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండాలని ఒత్తిడి తెచ్చారని, సుచిత్ర సర్కిల్ సమీపంలోనూ అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు.
బాలిక జనవరి 19, 26 తేదీల్లో ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా తల్లి ఆరోపించారు.
ప్రతివాద ఫిర్యాదు
ఇదిలా ఉండగా, సాయి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ టూటౌన్ పోలీసులు బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, నిరాకరించడంతో డబ్బులు డిమాండ్ చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాను ఇప్పటికే రూ.50 వేలు ఇచ్చానని, అనంతరం రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 308(5), 351(2), 61(2) రీడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.
రాజకీయ స్పందనలు
ఈ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్, రాజకీయ కుట్రలో భాగంగానే తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు తన ప్రతిష్ఠ దెబ్బతీయడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కేటీఆర్ స్పందిస్తూ, ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. “బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా?” అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Post a Comment