•బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం
•రూ.50 లక్షల SDF నిధులతో నిర్మాణం,
•ప్రభుత్వ సలహాదారు పోచారం, కలెక్టర్, జుక్కల్ ఎమ్మెల్యే, ఆగ్రోస్ చైర్మన్ కాసుల హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడలో SDF నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, కొత్త ఆర్డీఓ రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, జగిత్యాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి అవసరం
ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంతారావు మాట్లాడారు. ప్రజల సమస్యలను అధికారులు తక్షణమే గుర్తించి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను విని చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
సేవా కేంద్రాలుగా కార్యాలయాలు
ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సేవా కేంద్రాలుగా పనిచేయాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పనులు పూర్తి చేసుకునేలా అధికారులు సహకరించాలని వారు పేర్కొన్నారు.
నూతన ఆర్డీఓకు సూచనలు
నూతన ఆర్డీఓ రవీందర్ రెడ్డికి ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ-జుక్కల్ పరిధిలో ఉన్న మండలాల ప్రజలకు అందుబాటులో ఉండి, ఆ ప్రాంత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీఎస్పీ, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Post a Comment