Rowdy Mela | జిల్లాలో రౌడీయిజానికి పూర్తిగా నిర్మూలన: ఎస్పీ రాజేష్ చంద్ర


జిల్లాలో రౌడీయిజానికి పూర్తిగా నిర్మూలన: ఎస్పీ రాజేష్ చంద్ర

సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీట్ల తొలగింపునకు కమిటీ ఏర్పాటు

కామారెడ్డిలో రౌడీ షీటర్లతో "రౌడీ మేళా"

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, మే 11:

జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, అసాంఘిక చర్యలకు ఏమాత్రం సహనం ఉండదని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లతో "రౌడీ మేళా" నిర్వహించారు.




రోడ్లపై ప్రత్యేక నిఘా, "రోడీ మేళా" ద్వారా మార్పు దిశగా అడుగు వేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసు రికార్డులు, స్థానిక పోలీస్ అధికారుల నివేదికలు, జిల్లా స్థాయి రౌడీ షీట్ల రివ్యూ కమిటీ పరిశీలన ఆధారంగా సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు.

వరుసగా 10 సంవత్సరాల పాటు ఎలాంటి నేరాల్లో ప్రమేయం లేకుండా మంచి ప్రవర్తన కనబరిచిన వారికి నిష్పక్షపాత విచారణ అనంతరం జిల్లా అధికారుల కమిటీ సిఫారసు మేరకు రౌడీ షీట్లు తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే మార్పు చూపకుండా తిరిగి నేరాలకు పాల్పడితే రౌడీ షీట్లు యథావిధిగా కొనసాగుతాయని, కోర్టులో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, గంజాయి విక్రయం, హత్యలు, గొడవలు వంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ అన్నారు. నేరాలు, బెదిరింపులు, దందాలకు తావులేకుండా నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో కత్తులు, ఆయుధాలతో ఫోటోలు పోస్టు చేయడం, ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, వితల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post