![]() |
| బాన్స్ వాడ లో ఉద్యోగులు సమావేశం నిర్వహించిన దృశ్యం |
•ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
•5న కామారెడ్డిలో సామూహిక నిరాహార దీక్ష
•TGEJAC పిలుపు
•బాన్సువాడలో భారీ సన్నాహక సమావేశం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 5, 2026న కామారెడ్డి జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు TGEJAC ప్రకటించింది.
ఈ దీక్షను విజయవంతం చేసేందుకు శుక్రవారం బాన్సువాడ డివిజన్‌లోని అన్ని మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సభ్యులతో బాన్సువాడ పెన్షనర్స్ సంఘ భవనంలో సన్నాహక సమావేశం జరిగింది.
TGEJAC జిల్లా అధ్యక్షుడు N. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, "రాష్ట్రవ్యాప్తంగా TGEJAC ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక నిరాహార దీక్షలో భాగంగా మే 5న కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు దీక్ష చేపడుతున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి" అని పిలుపునిచ్చారు.
4 ప్రధాన డిమాండ్లు:
1. PRC: నూతన వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే ప్రకటించాలి
2. OPS: CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
3. బకాయిలు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు రావాల్సిన డీఏ బకాయిలు, ఇతర మొత్తాలను ఏకమొత్తంలో చెల్లించాలి
4. EHS: ఉద్యోగుల ఆరోగ్య పథకం EHSను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలి
నాయకుల హెచ్చరిక:
TGEJAC అడిషనల్ సెక్రటరీ జనరల్ అల్లాపూర్ కుశాల్, జిల్లా JAC బాధ్యులు అంబిర్ మనోహర్, యాదయ్య, వెంకట రమణ, విజయ రామరాజు, నార్ల అరుణ్ కుమార్, జగన్ మాట్లాడుతూ, "ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. వారిని దూరం చేయడం, ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఉద్యోగుల మానసిక వేదనతో పాటు రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది" అని హెచ్చరించారు.
"పోరాడితే పోయేదేముంది సమస్యల పరిష్కారం తప్ప. ఇది అందరి సమస్యగా భావించి మే 5న జరిగే రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలి" అని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సన్నాహక సమావేశంలో వివిధ మండలాల బాధ్యులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment