![]() |
_తడి బట్టలు ఆరేస్తుండగా ప్రమాదం: ముందు భార్య, కాపాడబోయి భర్త మృతి_
_ముగ్గురు కూతుళ్లకు తల్లిదండ్రులు దూరం: గ్రామంలో విషాద ఛాయలు_
_వర్షాకాలంలో విద్యుత్ జాగ్రత్తలు తప్పనిసరి: అధికారులు_
తెలంగాణ డైలీ న్యూస్, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్‌పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో జ్యోతి, సంజీవ్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
అసలేం జరిగింది?గ్రామానికి చెందిన సంజీవ్, జ్యోతి దంపతులు ఆదివారం పొలంలో వరి నాటు వేసి ఇంటికి వచ్చారు. ఆరుబయట తడి బట్టలు ఆరబెట్టేందుకు భార్య జ్యోతి వెళ్లగా ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది.
భార్యను కాపాడేందుకు భర్త సంజీవ్ వెళ్లడంతో ఆయనకూ విద్యుదాఘాతం తగిలి ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విద్యుత్ తీగలు తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ముగ్గురు ఆడపిల్లలకు తీరని శోకం
మృతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా తల్లిదండ్రులు తమను విడిచిపెట్టి వెళ్లడంతో వారి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల హెచ్చరిక
వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని, తడి చేతులతో స్విచ్ బోర్డులు, విద్యుత్ ఉపకరణాలు ముట్టుకోరాదని, తీగలపై బట్టలు ఆర వేయరాదని అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.



Post a Comment