కేసీఆర్ హయాంలో వరిలో తెలంగాణ నెం.1.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం కుంటుపడింది
కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధ్వజం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 20: "రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రిమండలి రైతాంగంపై తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వ సిగ్గులేనితనానికి నిదర్శనం" అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. శనివారం కామారెడ్డిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రైతుల ధర్నాలు పట్టవా?
"రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదు. రైతును అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తోంది. గత కేసీఆర్ హయాంలో వరి పంట సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాన్ని కుంటుపడేసి, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆరోపించారు.
హామీలు మరిచిన కాంగ్రెస్
"ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మరిచి, కేంద్రం ఇచ్చిన కోటా మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు. తక్కువ దిగుబడినిచ్చే వంగడాలను పండిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పడం రైతుల నడ్డి విరిచే ప్రయత్నం" అని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమం
"రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి వరి ధాన్యం సాగులో తెలంగాణను దేశంలోనే నెం.1గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. దేశంలోనే వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అందించాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయన అధికారంలోకి రాగానే రైతు మరణిస్తే కుటుంబం రోడ్డున పడవద్దని రైతు బీమా తెచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు బీమా ప్రీమియం కట్టడానికి కూడా డబ్బులు లేవు" అని ఎద్దేవా చేశారు.
మూడు విడతల రైతు భరోసా ఎగ్గొట్టారు
"రాష్ట్రంలో రైతు భరోసా మూడు విడతలు ఎగ్గొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతాంగాన్ని నీచంగా, దుర్మార్గంగా మోసం చేస్తోంది. ఎరువుల కోసం యాప్ విధానం తొలగించి నేరుగా ఎరువులు పంపిణీ చేయాలి. లేని పక్షంలో రైతులు తగిన బుద్ధి చెబుతారు" అని హెచ్చరించారు.
71 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం చేశారు?
"కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి 71 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రం కోసం చేసిందేమీ లేదు. రైతు డిస్కంల పేరుతో రైతులను మోసం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది" అని ఆరోపించారు.
"రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడమే మోడీ, బీజేపీ ఉద్దేశ్యం. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన అండగా ఉంటుంది" అని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు.



Post a Comment