బీర్కూర్ తండాలో రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనం ప్రారంభం
_ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పోచారం శుభాకాంక్షలు_
_గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం_
తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్, జూన్ 20: బీర్కూర్ మండలం బీర్కూర్ తండాలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
అనంతరం అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులు ఇస్లావత్ బుజ్జి - సర్ చాంద్ దంపతులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సొంతింటి కల నెరవేరడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, "గ్రామాల సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ నిధులతో పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుస్తున్నాం" అని తెలిపారు.
గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, బీర్కూర్ తండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






Post a Comment