రెడ్‌క్రాస్ సభ్యత్వంలో కామారెడ్డి జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం
సభ్యత్వ గడువు జూలై 31 వరకు పొడిగింపు
అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ శాఖ రక్తదాన శిబిరం
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 16: రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా కామారెడ్డి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభించిందని, ప్రతి శాఖ అధికారి, ఉద్యోగి అంకితభావంతో పనిచేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందన్నారు. జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు గర్వకారణమని పేర్కొన్నారు.
ఇంకా మన జిల్లా అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు గడువును జూలై 31 వరకు పొడిగించినందున, పెండింగ్‌లో ఉన్న నమోదులను పూర్తిచేసి జిల్లాను మరింత ముందంజలో నిలపాలని సూచించారు. ఇప్పటివరకు అందించిన సహకారానికి అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహం, నిబద్ధతతో కార్యక్రమాన్ని కొనసాగించి కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు.అనంతరం అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని 25వ రూమ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయడమేనని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైన సమయంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఇది సురక్షితమైన మానవతా దృక్పథంతో కూడిన సేవ అని తెలిపారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్న సిబ్బందిని కలెక్టర్ అభినందించి, సమాజంలో రక్తదానంపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
=================
బడిబాటలో కలెక్టర్ పర్యటన
శెట్‌పల్లిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన జిల్లా కలెక్టర్
విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ
ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం
కామారెడ్డి, జూన్ 16: బడిబాట కార్యక్రమంలో భాగంగా లింగంపేట మండలంలోని శెట్‌పల్లి ZPSS, అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలక, బలపాలను అందజేశారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల హాజరు, అభ్యాస నైపుణ్యాల పెంపు, ప్రాథమిక విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో RDO, DEO, MPDO, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




Post a Comment